ఉపాస్తి
శ్రీతాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి
స్వసై#్మ నమః పథ మహం కరవాణి వాణి
మత్తో నహీతర దనేక మథైకకంవా,
అస్మా దసత్తదధివా స్వరసప్రసారా
దావిర్భవత్వవాకమః ప్రతియోగి త్వం త్వం.
శ్రీ చంద్రశేఖరపదాంకిత సంయమీంద్ర
శ్రీ పూజ్యపాద మహనీయ వపుర్విశేషే,
నారాయణాధి పద రాఘవపూర్వనామ
ప్రహ్వం వవుర్భవతు సంవ్యవహారి హారి.
శ్రీ శ్రీ శ్రీ ప. ప. శ్రీ మచ్చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు నిరంతర సిధ్ధులు. జగత్ర్పసిద్ధులు. జగత్కు టుంబులు. కంచికామకోటి పీఠాధ్యక్షులు. ప్రస్తుతము పంచ మాశ్రమనిష్ఠులు.
ఒకపుడు దత్తాత్రేయులవారిని 'శాస్త్రములలో నాలుగు ఆశ్రమములేకలవు. ఐదవ ఆశ్రమము లేదుకదా' యని శిష్యులు ప్రశ్నింప 'అది నాయట్టివానికి మాత్రమే గోచరించు నదని' సమాధానము చెప్పెను. ఆ ప్రశ్నోత్తర గ్రంథము చదివినను పరవాక్యార్థముతప్ప ఆ విషయములు అనుభవమునకు రాలేదు.
ప్రస్తుత కాలమున శ్రీ స్వామివారిని దర్శించిన వారికి ఆ విషయము అనుభవమునకు రాక తప్పదు. వారి ప్రవర్తనము మనము అర్థము చేసికొనుట కష్టము. కాని, లోకమంతయు స్వామివారికి నాయందు యెక్కువ వాత్సల్యమని చెప్పుకొను చుందురు. ఆ భావము రామాయణములో వానరము లన్నియు శ్రీరామచంద్రమూర్తికి నాయందే అనుగ్రహమని, నాయందే అనుగ్రహమని, నన్ను చూచి నవ్వెనని, నన్ను చక్కగ చూచెనని, నన్ను మెచ్చుకొనెనని, నావైపుకు బాహువులు చాచెనని చెప్పుకొనుచున్నట్లు వాల్మీకి మహాముని వర్ణించెను. అట్టి మహాపురుషులకు దక్క మరోకళ్ళకు అట్టి సర్వాహ్లాదన శక్తి ఉండదు. ఆ మహాత్ములు ఎక్కడనో అవతరించి, బ్రహ్మ చర్యము గడుపుకొని, 13వ సంవత్సరముననే ఆశ్రమ స్వీకారముచేసి పీఠాధిపుతులై నప్పటినుండి నిత్యము దేశసంచారము చేయుచు, భక్తులను ఉద్ధరించుచు ఉపన్యాసరూపముగా ధర్మజ్ఞానముల వెదజల్లుచు వచ్చిరి. వారి వాచికమందలి ప్రభావము నిత్యసత్య మైనది గనుక విన్నదే అని చెప్పక తప్పదు.
లోకములోఉపన్యాసధోరణుల మాదిరి, వెంటనే జారిపోకుండా బుద్ధిమంతులు సంగ్రహించి, భాషాంతరమున గూర్చి భారతమునవ్యాప్తి నొందించిరి. ఆ ఉపన్యాసము లన్నియు ఒక ముఖమునకు దెచ్చి, తెలుగుభాషలో గ్రంథ రూపముగా సాధన గ్రంథ మండలి, వారు ఇంతవరకు తొమ్మిది భాగములు ప్రకటించిరి. ఇది పదివ భాగము. ఈ విధముగా శ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రిగారుశ్రీస్వామి వారి అనుగ్రహమునకు లోకాదరణమునకు పాత్రులైరి.
వేదములు, ఉపనిషత్తులు, భాష్యములు ఉన్నవికదా, ఈ విజ్ఞానమునకు శ్రీస్వామివారి ఉపన్యాసములనే కొనియాడు టెందులకు? అని కొందరు ప్రశ్నింప వచ్చును. కాని ఆ విద్యలు సంస్కృతభాషలో నున్నవి. భాషవచ్చినను అర్థమగుట దుర్లభము. వానిని చదువు విద్యార్థులు తర్కమీమాంసతో సంబంధముచేసికొని చదువవలయును. వారు చెప్పిన ఉపన్యాసములుకూడా తర్కమీమాంసానుస్యూత ములుగానే ఉండును. అది సామాన్యుల మనస్సుకు పట్టుట కష్టము. శ్రీ స్వామివారన్నచో గురుప్రసాదమును పొంది, కైకొన్న విద్యను అనుభవించి, తమ అనుభవమును తేట మాటలతో వెల్లడించిరి.
ఈ ఉపన్యాసములు పండితులకు పామరులకు కూడ ఆవశ్యకములు పామరులకు సులభముగా అర్థమగును. పండితులకు తమ అనుభవము సరిగా- సరిగాదా అని రుజువు చూచికొనుట కుపయోగించును. శ్రీస్వామివారి ఉపన్యాస ధోరణిలోకి లోకజ్ఞానము, శాస్త్రజ్ఞానము, ధర్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానముకూడ 'నేను-నేనని' వెలువడుచుండును. చాలమంది ఉపన్యాసకులున్నను ఇట్టి అనుభవము చెప్పుట శ్రీ స్వామివారికే తగినది. ఇట్టి ధోరణి యక్షప్రశ్నలలో ధర్మరాజు సమాధానమునకు సరిపోవును.
శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యులవారి భాష్యాది ప్రసంగములలోకూడ ఇది సర్వజ్ఞత్వము. మామూలుగా కన్పట్టు చున్నది. కావున యిట్టి మహాపురుషులు అగతికులకు గతి కల్పింప నవతరించుచుందురు. ఆ దృష్టితో ఈ ఉపన్యాస సంపుటములను పఠించి, సర్వశాస్త్రసారమైన అనుభవమును పొంది, భక్తులెల్లరు కృతార్థు లయ్యెదరు గాక !
ఓం తత్సత్.
|